శుక - జనక సంవాదం
జనకుడు: తమవంటి విరాగికి నేను బోధించగలిగేదీ - బోధించ దగినదీ ఏముంటుంది? నేను బోధించదగిన కులజుడను కాను!
శుకుడు: ఏది ఏమైనా, తమ వల్లనే తెలుసుకొని తీరాలన్నది మా పితృదేవుల ఆజ్ఞ! నేను మోక్షకామిని. తపస్వాధ్యాయ తీర్థ వ్రత రాజాలతో అది సిద్ధిస్తుందా? జ్ఞానమే మోక్షదాయినా?"
జనకుడు: పారాశర్యపుత్రా! తాము అడిగి నందున చెప్తున్నాను. నా చేత తమ తండ్రిగారు చెప్పించాలనుకోవడం వల్ల చెప్తున్నాను. అంతేకాని, అహంకరించి - నాకు ఇదంతా తెలుసునని మాత్రం కాదు. వేదాధ్యాయనానంతరం గురు దక్షిణ చెల్లించిన విప్రుడు నేరుగా ఇంటికి తిరిగి రావాలి. తల్లిదండ్రులకు ఆనందం కలిగించేలా ఒక చక్కని కన్యను వివాహం చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించాలి. దురాశా రహితుడై అగ్నిహోత్రాదికాలు నిర్వర్తిస్తూ, క్రమంగా ఆరు అంతశ్శత్రువులనీ జయించాలి. భార్యను, కొడుకు పోషణ వర్గంలో ఉంచి, సన్యాసాశ్రమం స్వీకరించాలి. ఇది లోక విదితమూ - లోక విహితమూ అయిన కర్మ. ఇదే మార్గం!
శుకుడు: తాము చివరగా సన్యాసం చెప్పారు. మొదట చెప్పిన అధ్యయనం అదే రీతిని కొనసాగిస్తూ, సన్యాసాశ్రమంలోకి వెళ్లకూడదా? జ్ఞాన సముపార్జన నిరంతరాయంగా కొనసాగుతుంది కదా!
జనకుడు: ఇంద్రియాలు ఎంత బలీయమైనవి? గనుక, వాటికొక 'అనుభవం' కల్పించి, ఆ తర్వాత వదిలేయడం జ్ఞాని అవలంబించదగినది. సన్యసించాక విషయవాంఛలలో తగులుకొన్నవారికి ముక్తి లేదు. మనస్సు మహా చిక్కనైనది. దాన్ని క్రమంగా లొంగదీసుకోవాలి.
శుకుడు: ఇంద్రియాలు చేసే దోషాలు ఆత్మకు అంటావా? వేదధర్మంలోనే అటువంటి కొన్ని - నాకు దోషాలుగా కనడ్డాయి. ఉదాహరణకు - హింస, సురాపానం.
జనకుడు: ఇంద్రియాల వల్ల ఆచరించబడే గుణదోషాలు ఆత్మకు అంటవు. కాని వేదాలు ఏర్పరచిన కట్టుబాట్లు - మర్యాదలు లోకహితం కోసమే! పశుప్రవృత్తి నుంచి మానవుని ఉద్ధరించడానికే! రాగద్వేష రహితంగా చేసే హింస, నిజానికి 'అహింస' చూసేవారి దృక్కోణాన్ని బట్టి మారుతుంది.
శుకుడు: మాయావృతుడై మాయ మధ్యలో సంచరించే మానవుడు ఎలా విరాగి కాగలగుతాడు? అంతరంగంలోని తిమిరాన్ని తరమాలంటే సాధ్యమా?
జనకుడు: నేనీ రాజ్య సుఖాలూ, భోగభాగ్యాలూ అనుభవిస్తూనే ఉండి, వైరాగ్యం గురించి చెప్పడమేమిటని తాము హృదయంలో ఆలోచిస్తున్నారు - అవునా? నిస్సంగత్వం, నిర్మోహత్వం మనం మనస్సును అధీనంలో ఉంచుకోవడం చేతనే సాధ్యమవుతుందని మరోసారి నొక్కి వక్కాణిస్తున్నాను. 'ఈ దేహంనాది' అనుకుంటేనే వస్తుంది తంటా! 'దీనికి బాధ్యుడ్ని లేదా బద్ధుడ్ని' అనుకుంటేనే వస్తుంది ముప్పు. తాము గురుపుత్రులు నాకు గురుదేవులు పరమ పూజ్యులు గనుక, వారి పుత్రులయిన తాము అంతే! కాని తాము పితృబాంధవ్యాన్ని వదిలేసి అరణ్యాలకు పోయి తపోదీక్షతో ముక్తి సాధిద్దామని ఊహిస్తున్నారు.
'ఊహ' అని ఎందుకనాల్సి వచ్చిందంటే, అదే నిజమైన పదం. అరణ్యాలలోని మృగాలతో అనుబంధం (అవీ జీవులే కనుక) ఏర్పడుతుంది. ఇక నిస్సంగత్వం నిజంగా సాధ్యమేనా? గిరి శిఖరాలకు చేరితే పక్షులుంటాయి. నీట మునిగితే జల చరాలుంటాయి. ఈ చరాచర ప్రపంచంలో జీవ కోటి లేని దెక్కడ?
ఆకులు, అలములు ఏదో ఒక ఆహారం కావాలి.నిరాహారంగానో - కౌపీన రహితంగానో ఉండగలమా? ఇక నిశ్చింత ఏది? అంటే - వనాల్లో ఉన్నా, ఈ సృష్టిలో ఎక్కడ ఉన్నా అన్నవస్త్రాదుల ఆలోచన దేహధారికి తప్పనపుడు, ధ్యానైక మగ్నుడు కాగలడా?
"మోక్షానికి ప్రతిబంధకాలు ఏర్పడతాయని దూర దేశాలకో, కీకారణ్యాలకో పోవాలనుకుంటే, ఇంత వరకు చెప్పినవీ ప్రతిబంధకాలే అవుతున్నాయి. దిగంబరంగానూ - వాయుభక్షణ చేస్తూనూ తపస్సు కొనసాగించడం వల్ల ముముక్షు మార్గం అవలంబించ వచ్చునని వెళ్లి అప్సరకాంతల వల్ల చిత్తం చెడి తపశ్శక్తి పోగోట్టుకున్న వారిని గురించీ పురాణాలలో చదివారు కదా! నిరంజన, నిర్వికార చింతన మనస్సుకు సాధ్యం అయినపుడు మాత్రమే ముక్తి గోచరిస్తుంది. నన్ను చూడు! రాజ్యం చేస్తున్నాను. ఎవరికీ ద్రోహం తలపెట్టను. అనగా దురాక్రమణ. నాకు విహితమైనది ఇది. విధి నిర్వర్తిస్తున్నాను. ఇది ఇలాగే ఉంచాలనీ - పెంచాలనీ కాంక్షలేదు. నిర్వికల్పానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. ఈ మాత్రం చాలు! జ్ఞానులు గనుక అర్థం చేసుకోగలరు" అని ముగించాడు.
No comments:
Post a Comment